Wednesday 27 July 2011

raginamalapi 30th na nirnayam:tdp forum

రాజీనామాలపై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 30న తాము సమావేశం కానున్నామని టీడీపీ టీ ఫోరం వెల్లడించింది. ఆగస్ట్ 1 నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నందున తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ అదే రోజున ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేయనున్నట్లు ప్రకటించింది. మంగళవారం బంజరాహిల్స్‌లోని తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్‌డ్డి ఇంట్లో ఫోరం నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, కడియంశ్రీహరి, దేవేందర్‌గౌడ్, ఎమ్మెల్యేలు రావుల చంద్రశేఖర్‌డ్డి, గంగుల కమలాకర్, గంప గోవర్థన్, విజయ రమణారావు, దయాకర్‌డ్డి, ఉమా మాధవడ్డి, సీతక్క సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం మీడియాతో ఎర్రబెల్లి మాట్లాడారు. పరిస్థితులను పరిశీలించి రాజీనామాలపై నిర్ణయాలు తీసుకోవడానికి తిరిగి 30న సమావేశమౌతున్నామని తెలిపారు.

తెలంగాణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి చేయాలని కాంగ్రెస్ నేతలకు ఆయన సూచించారు. ఢిల్లీలో చర్చలకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను కేంద్రం మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. మోసపోయి తిరిగి రావద్దని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. ఇక్కడ స్పీకర్, సీఎం కూడా మోసం చేస్తున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. ఆయన మోసాలకు బలి కాకూడదని, ముందుండి పోరాడాలని కాంగ్రెస్ నేతలను కోరారు. టీ కాంగ్రెస్ నేతలు ఒంటరి వాళ్లు కాదని అన్నారు. అందరం కలిసి ఉద్యమిద్దామని చెప్పారు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలని ఎర్రబెల్లి కోరారు.

తాము స్పీకర్ రాగానే రాజీనామాలు చేస్తామని ఆయన ప్రకటించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సెక్రటరీలు ఫోన్‌లో కూడా అందుబాటులో లేరని అన్నారు. తాము న్యాయ సలహా తీసుకుంటున్నామని తెలిపారు. తాము సంక్షోభం కోసమే రాజీనామాలు చేశామని అన్నారు. తాము రాజీనామాలు చేస్తే అవి తిరస్కరణకు గురి కాకూడదని అన్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్లి రాజీనామాలు ఆమోదింపజేసుకుంటామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

కేశవ్ చీడపురుగు
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యాపుల కేశవ్ తెలంగాణను అడ్డుకునే వ్యక్తి అని ఎర్రబెల్లి అన్నారు. ఇలాంటి వాళ్లు తెలంగాణకు చీడపురుగులని ఘాటుగా స్పందించారు. ఆయన రెచ్చగొట్టి సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ‘‘ఇలా చేస్తే తెలంగాణ ప్రజలకు శత్రువుగా మిగులుతావు. అలా మిగిలిపోద్దు..’’ అని ఆయన హితవు పలికారు. ‘‘రాజీనామాలతో తెలంగాణ రాదని అంటున్నావు. ఆప్పుడు సమైక్యాంధ్ర కోసం ఎందుకు రాజీనామాలు చేశావు?’’ అని కేశవ్‌ను ప్రశ్నించారు. ‘‘ఉద్యమాలు ఎలా చేయాలో మాకు నేర్పిస్తావా? ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఖబడ్దార్’’ అని కేశవ్‌ను హెచ్చరించారు.

‘‘మీ నిర్ణయాలలో తలదూరుస్తున్నామా? ప్రజల మనోభావాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉద్యమాలు చేస్తున్నా. మీరెందుకు కల్పించుకుంటారు? మీకేం అవసరమని అడిగారు? అని నిలదీశారు. 30న సమావేశమై పరిస్థితులను బట్టి రాజీనామాలపై మాట్లాడతామని మరోసారి అన్నారు. తమ రాజీనామాలు రాజ్యాంగ సంక్షోభానికి దారి తీయాలని అన్నారు. అందరూ క్యూ కట్టి రాజీనామాలు చేయాలని కోరారు. సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలకు సిద్ధమని అన్నారు. దయచేసి తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని కాంగ్రెస్ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ కుట్రలను తిప్పి కొడదామన్నారు. అందరం కలిసి ఒకే వేదికపైకి రావాలని కోరారు.

No comments:

Post a Comment