Wednesday 27 July 2011

telangana evvanani congress thelchesindi:errabelli

తెలంగాణ రాష్ట్రం ఇవ్వనని కాంగ్రెస్ పార్టీ తేల్చేసిందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు అభిప్రాయపడ్డారు. గత కొన్ని రోజులుగా కేంద్రంలో ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, గులాం నబీ ఆజాద్ తదితరులు చేస్తున్న ప్రకటనలు...మాట్లాడుతున్న మాటలు ఆ పార్టీ అభిప్రాయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 'ఇక రాజీనామాలు, పోరాటాలే శరణ్యం. ఎమ్మెల్యే పదవులకు తెలంగాణలోని టిడిపి ఎమ్మెల్యేలంతా సిద్ధంగా ఉన్నారు. అందులో వెనక్కు పోయే సమస్యే లేదు. ఫ్యాక్స్‌లో రాజీనామాలు పంపడం వంటి డ్రామాలు మేం చేయం.

స్పీకర్ వచ్చిన తర్వాత నేరుగా ఆయన చేతికే ఇస్తాం. దానికి ముందు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలనూ కలుస్తాం...అందరినీ ఒకచోటికి పిలుస్తాం. అందరం కలిసి రాజీనామాలు ఇద్దామని ప్రతిపాదిస్తాం. అందరినీ ముగ్గులోకి తీసుకువస్తాం. తెలంగాణ ఎట్ల రాదో చూస్తాం. మేం చిత్తశుద్దితో ఉన్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వెనక్కు పోవద్దని విజ్ఞప్తి' అని ఆయన అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డితో కలిసి బుధవారం ఆయన ఇక్కడ టిడిఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏకాభిప్రాయం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ కేంద్ర నేతలు ఎన్నికల ముందు ఎప్పుడైనా ఆ మాట అన్నారా అని ఆయన ప్రశ్నించారు. '2004 ఎన్నికలకు ముందు తమను గెలిపిస్తే తెలంగాణ ఇచ్చేస్తామని చెప్పారు.

ఏకాభిప్రాయం మాటే ఆ రోజు రాలేదు. 2009 ఎన్నికల ముందు మళ్ళీ తెలంగాణ ఇస్తామన్నారు. అప్పుడూ ఏకాభిప్రాయం గురించి మాట్లాడలేదు. ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఎక్కడా ఏకాభిప్రాయం ఊసే లేదు. ఇప్పుడు ఆ మాట మాట్లాడటం పచ్చిమోసం. కేంద్రం ఇవ్వదల్చుకొంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటులో బిల్లు పెట్టి ఇవ్వవచ్చు. ఆ పని చేయకుండా మోసం చేస్తున్నారు. ఇతర పార్టీల అభిప్రాయాలు కోరే ముందు కాంగ్రెస్ పార్టీ తన పార్టీలో ఏకాభిప్రాయం సాధించాలి' అని ఆయన డిమాండ్ చేశారు.

టిడిపిలో భిన్నాభిప్రాయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న కేంద్రం గతంలో తమ పార్టీ ఏకాభిప్రాయంతో తెలంగాణ కోసం లేఖ ఇచ్చినప్పుడు ఎందుకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. 'మేం లేఖ ఇచ్చినప్పుడు కిమ్మనలేదు. ఇప్పుడు భిన్నాభిప్రాయాల గురించి మాట్లాడుతున్నారు. కేంద్రం ఇవ్వదల్చుకొంటే మిగిలిన పార్టీల అభిప్రాయాలతో పనేలేదు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 14 (ఎఫ్) తొలగించాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే తీసేశారా? మేం శాసనమండలి పెట్టవద్దంటే ఆగారా? విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలని కోరితే విన్నారా? మేం ఏం చెబితే కాంగ్రెస్ పార్టీ దానికి పూర్తి విరుద్ధంగా చేస్తుంది' అని ఆయన వ్యాఖ్యానించారు.

రాజీనామాలు చేసే ప్రజా ప్రతినిధులకు తెలంగాణలోని అన్ని పార్టీల ముఖ్య నేతలు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని దయాకరరావు పేర్కొన్నారు. ఈ విషయం తాను అనేకసార్లు చెప్పినా ఇతర పార్టీల నుంచి స్పందన రావడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 'నేను, కెసిఆర్, కోదండరాం, జానారెడ్డి, గద్దర్, విమలక్క...అందరూ కలిసి కూర్చుని హామీ ఇవ్వాలి. రాజీనామాలు చేసినవారిపై ఎవరూ పోటీ పెట్టవద్దని...తెలంగాణ వచ్చేవరకూ ఎవరం పోటీ చేయవద్దని చెప్పాలి. అన్ని పార్టీల నేతలు దగ్గర ఉండి రాజీనామాలు చేయించాలి. అప్పుడే ఐకమత్యం వస్తుంది' అని ఆయన అన్నారు.

తెలంగాణ రావడం కన్నా కూడా ఈ ప్రాంతంలో కాంగ్రెస్, టిడిపి పార్టీలను మూతవేసి తానొక్కడే ఉండాలన్న తహతహ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌లో అధికంగా కనిపిస్తోందని మహేందర్ రెడ్డి విమర్శించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఎన్నికల్లో వారికి మద్దతిస్తానని కెసిఆర్ ఇంతవరకూ తన నోరు తెరిచి అనలేదని, తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం కూడా ఆ మాట అనడం లేదని ఆయన ఆరోపించారు. డిసెంబర్ 9న చేసిన తన ప్రకటన నిలుపుకోవడానికి కాంగ్రెస్‌కు ఇతర పార్టీల లేఖలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.

No comments:

Post a Comment