Friday 29 July 2011

seemandhra leaders are terrorists:trs leader harish rao

యనమల వ్యాఖ్యలపై హరీష్‌రావు మండిపాటు
టీడీపీ ఫోరం నేతలు ఇప్పుడేమంటారని ప్రశ్న

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణకోసం యువకులు పిట్టల్లాగా రాలిపోతున్నా సీమాంధ్ర నేతలు కనీస మానవత్వం లేకుండా కసాయిల్లాగా, తీవ్రవాదుల్లాగా మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు మండిపడ్డారు. గురువారమిక్కడ తెలంగాణభవన్‌లో పార్టీ నేతలు ఎస్.నిరంజన్‌రెడ్డి, బి.సుమన్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘‘తెలంగాణకు అనుకూలమంటూ టీడీపీ 2008లో ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన తీర్మానానికి కాలం చెల్లిందని, 2011లో సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామంటూ ఆ పార్టీ సీనియర్ నేత యనుమల రామకృష్ణుడు మాట్లాడారు. చంద్రబాబుతో సమావేశమైన వెంటనే, పొలిట్‌బ్యూరో హాలులో మాట్లాడిన మాటలు టీడీపీ విధానాన్ని చెబుతున్నాయి. యనమల వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించకుంటే సమైక్యవాదమే టీడీపీ విధానమని ప్రజలు తేల్చుకుంటారు. తెలంగాణలో పీఆర్పీకి పట్టిన గతే టీడీపీకి పడుతుంది. టీడీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారు’ అని హెచ్చరించారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని, ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖను వాపస్ తీసుకోలేదని చెప్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ తెలంగాణ నేతలు ఇప్పుడు ఏమంటారని ప్రశ్నిం చారు. చంద్రబాబుతో తేల్చుకుంటారో, టీడీపీ నుండి బయటకొస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ తెలంగాణ నేతలు ఇంకా కళ్లు తెరువకుంటే ప్రజలు మూడోకన్ను తెరుస్తారన్నారు. టీడీపీ సమైక్యవాదానికి వెళ్లిందా.. తెలంగాణకు కట్టుబడి ఉందా అనేది చంద్రబాబుతో చెప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు టీడీపీ కట్టుబడి ఉంటే యనమల రామకృష్ణుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రవారు నాయకులు కాదని, ఖల్ నాయకులని విమర్శిం చారు. హైదరాబాద్‌లో రాజధాని పెట్టడం ద్వారా తెలంగాణ ప్రజలే త్యాగం చేశారన్నారు. విడిపోవడానికి ఏకాభిప్రాయం కావాలంటున్న వారికి కలిసి ఉండటానికి ఏకాభిప్రాయం అవసరంలేదా అని హరీష్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని సీమాంధ్ర నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.

No comments:

Post a Comment