Friday 29 July 2011

telangana ku anukulam ga echina lekha ku kalam chellindi:yanamala

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం గతంలో నియమిం చిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి కాలం చెల్లిందనీ... అలాగే ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలమంటూ తాము ఆ కమిటీకిచ్చిన లేఖకూ కాలం చెల్లిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ప్రణబ్ కమిటీ తర్వాత.. రోశయ్య కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, డిసెంబరు 9న చిదంబరం ప్రకటన, ఆ ప్రకటనకు సవరణ, తాజాగా మరో కేంద్రమంత్రి ఆజాద్ కాంగ్రెస్ నేతలతో సంప్రదింపుల వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవరిస్తూ తాజాగా జారీ చేసిన జీవోనే అందరూ పరిగణనలోకి తీసుకుంటారని, తెలంగాణ విషయంలో తమ లేఖ పరిస్థితి కూడా అంతేనని వ్యాఖ్యానించారు. ఆ లేఖకు విలువ ఉందో లేదో వెల్లడించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ విషయంలో కేంద్రం త్వరగా తేల్చాలని తాజాగా జరిగిన మహానాడులో తాము తీర్మానం చేశామని, అందులో అన్ని ప్రాంతాల వారు భాగస్వాములు అయినందున అదే అంతిమమని పేర్కొన్నారు. ఆ తీర్మానానికే తాము కట్టుబడి ఉంటామన్నారు. గురువారం ఎన్‌టీఆర్ భవన్‌లో యనమలతో పాటు మోత్కుపల్లి నర్సింహులు, కాలువ శ్రీనివాసులు, పి.చంద్రశేఖర్, ఎం.అరవిందకుమార్‌గౌడ్ , వేం నరేందర్‌రెడ్డి, పెద్దిరె డ్డి తదితరులు పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. అరవిందకుమార్‌గౌడ్, వేం నరేందర్‌రెడ్డి అక్కడ్నుంచి వెళ్లాక.. మిగిలిన నేతలు పొలిట్‌బ్యూరో సభ్యుల గదుల్లో ఉన్న సమయంలో యనమల మీడియాతో మాట్లాడారు. మే నెలలో జరిగిన మహానాడులో.. తెలంగాణపై తాము చెప్పాల్సింది అంతా చెప్పామని, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని తీర్మానించినట్లు గుర్తుచేశారు. ‘‘చిదంబరం, ఆజాద్ అడిగితేనో, వారు సమావేశాలు ఏర్పాటు చేస్తేనో వెళ్లాల్సిన అవసరం లేదు. మరోమారు అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామా లేదా అన్నది తర్వాత చెప్తాం. ఏ ప్రాంత నేతలు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఉద్యమాలు చేయటంతో పాటు ప్రజలు చేపట్టిన ఆందోళనల్లో భాగస్వాములు అవుతున్నారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన సీమాంధ్ర ప్రాంత నేతల సమావేశంలో కూడా సమైక్యాంధ్రకు కట్టుబడాలని తీర్మానించాం’’ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు రెండు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదన తమకు అంగీకారం కాదని, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో భాగమని చెప్పారు. రెండు, మూడు రాజధానులు అంటూ ఆజాద్ ఆంధ్రప్రదేశ్‌ను మరో జమ్మూకాశ్మీర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ర్టం రావణకాష్టం కావటానికి, ప్రాంతాల మధ్య విభేదాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారం కేంద్రమే నిర్ణయం తీసుకోవాలన్నారు. శ్రీకృష్ణ కమిటీకి చట్టబద్ధత లేదని, ఆ కమిటీ చేసిన ఖర్చును కాగ్ ప్రశ్నించే అవకాశం ఉందన్నారు. తమ పార్టీలోని సీమాంధ్ర, తెలంగాణ నేతలు కూర్చొని ఉమ్మడి అభిప్రాయానికి రావాలని చెప్తున్న చిదంబరం.. కాంగ్రెస్‌లో ఆ ప్రయత్నం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తమ పార్టీలోని అంతర్గత వివాదాలను పరిష్కరించుకునేందుకు కాంగ్రెస్.. తెలంగాణ సమస్యను అడ్డం పెట్టుకుంటోందని మండిపడ్డారు.

No comments:

Post a Comment