Wednesday 27 July 2011

telangana rasta sadanaki dappula daruvu

తెలంగాణ గుండె చప్పుడు భాగ్య నగర వీధులలో డప్పుల దరువై మోగింది.. అణచివేతను ధిక్కరిస్తూ కళాకారుల గొంతులు ఒక్కటయ్యాయి.. దిక్కులు పిక్కటిల్లేలా పాటల ప్రవాహం సాగింది.. తెలంగాణ కళాకారులతో సీమాంధ్ర కళాకారులు జతకట్టారు.. కోయా, ధింసా, గోండు నృత్యాలు చేశారు.. డప్పులు దరువుకు అనుగుణంగా కళాకారులు చిందేశారు... డోలు దెబ్బ చిందాట లంబాడీల నృత్యంతో నగరవాసులు పరవశించారు. బతుకమ్మ, బోనాలతో తెలంగాణ సంస్కృతి చాటిచెప్పి.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అరుణోదయ కళాకారులు నగారా మోగించారు.
తెలంగాణ సాధన కోసం కళాకారులు గర్జించారు. దిక్కుల పిక్కటిల్లేలా ‘జై తెలంగాణ’ నినాదాలు చేశారు. వారి డప్పుల దరువుతో భాగ్యనగరం దద్దరిల్లింది. తెలంగాణ అభిమానులను ఉత్తేజ పరిచింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కళాకారులు కూడా తెలంగాణ కోసం నినదించారు. సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమొక్రసి ఆధ్వర్యంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య మంగళవారం నిర్వహించిన తెలంగాణ డప్పుల దరువు, ఆట- పాటలో పాల్గొనడానికి వచ్చిన ఎర్రని దుస్తులతో కళాకారులతో ఇందిరాపార్కు ఎరుపు రంగు పులుముకుంది. ఉదయం 9 నుంచే తెలంగాణ జిల్లాల నుంచి వేలాది మంది కార్యకర్తలు ఇందిరాపార్కుకు తరలివచ్చారు.


వీరితో పాటు సీమాంధ్ర జిల్లాలైన కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కళాకారులు తరలివచ్చారు. వారంతా మధ్యాహ్నం వరకూ తమ తమ కళారూపాలను ప్రదర్శించారు. తెలంగాణలో కరెంటు కష్టాలను కళ్లకు కట్టినట్టుగా ఓ కళాకారుడు ప్రదర్శించాడు. హైదరాబాద్ కళాకారులు బోనాలు, బతుకమ్మతో ఇందిరాపార్కుకు తరలివచ్చారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రముఖ విద్యావేత్త, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య కళాకారుల ప్రదర్శనను ప్రారంభించారు. సీపీఐ(ఎంఎల్) న్యూ డెమొక్షికసీ, అరుణోదయ కళాకారులు, పీఓడబ్ల్యూ నాయకులు వేములపల్లి వెంకవూటామయ్య, నాగన్న, అరుణోదయ రామారావు, సూర్యం, గోవర్ధన్, సంధ్య, ఝాన్సీ ప్రదర్శనకు ముందు భాగాన నడువగా కళాకారులు వెంట నడిచారు.



పార్కు నుంచి డప్పు దరువులతో కిలోమీటర్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీని భాగ్యనగరవాసులు ఆసక్తిగా తిలకించారు. మాజీ ఎమ్మెల్యే బోడ జనార్దన్, న్యాయవాదుల జేఏసీ కళాకారులకు సంఘీభావం ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటలకు సుందరయ్య పార్కుకు ఈ ర్యాలీ చేరుకుంది. అనంతరం కళాకారులు వేదికపై ప్రదర్శనలు ఇచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన కొండడ్లు, ఆదిలాబాద్‌కు చెందిన థింసా, గోండు, నిజామాబాద్‌కు చెందిన సింధు, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, హైదరాబాద్, మెదక్, రంగాడ్డి జిల్లాల డప్పు కళాకారులు వేదికపై ప్రదర్శనలు ఇచ్చారు. సీమాంధ్ర జిల్లాలైన కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కళాకారులు కూడా ‘జై తెలంగాణ’ అంటూ తమ కళారూపాలు ప్రదర్శించారు.

తెలంగాణ సాధించే వరకూ పోరాడుతామని కళాకారుల తరుపున అరుణోదయ రామారావు ప్రకటించారు. తెలంగాణ తల్లిని తాళ్లతో కట్టి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర హోంమంత్రి చిదంబరం, సీఎం కిరణ్‌కుమార్‌డ్డి, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, కేంద్ర బలగాలు, పోలీసులు ఆయుధాలు చేపట్టి బంధించిన దృశ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం తెలంగాణవాదులు తల్లిని చెరనుంచి విడిపించి, వారిని చితకబాదినట్టు ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ఇచ్చిన కళాకారులు వేదిక దిగగానే పోలీసులు కళాకారుల చేతుల్లో ఉన్న బొమ్మ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ న్యాయవాదుల జేఏసీ కలుగజేసుకొని అవి బొమ్మ తుపాకులేనని వివరించడంతో పోలీసులు వాటిని తిరిగి ఇచ్చారు. కాగా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భారీగా బలగాలను, పోలీసులు దించింది. వీరికి తోడు ఇంటలిజెన్స్ వర్గాలు కళాకారుల మధ్య సంచరించాయి. ప్రదర్శన మొత్తాన్ని వీడియో తీశారు.

సమ్మెతో పాలన స్తంభించాలి: కోదండరాం, జేఏసీ చైర్మన్
తెలంగాణ వచ్చేదాక సకల జనుల సమ్మె చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. రాజీనామాల ఆమోదం విషయంలో స్పీకర్ వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. తెలంగాణ ఉద్యమాన్ని కవులు, కళాకారులు మరింత బలోపేతం చేయాలని కోరారు. ఆగస్టు 1 నుంచి చేపట్టే సకల జనుల సమ్మెలో అందరూ పాల్గొనాలని సూచించారు. సమ్మెతో రాష్ట్ర పరిపాలన స్తంభిస్తేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందన్నారు.

సుందరయ్య పార్కులో ‘తెలంగాణ కోసం డప్పు దరువు, ఆటా- పాట’ కార్యక్షికమంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. తెలంగాణ కోసం సమ్మెకు దిగుతున్నామని 15 రోజుల క్రితమే ఉద్యోగులు నోటీసిస్తే తెలంగాణ అంశం నా చేతుల్లో లేదని, ఢిల్లీ చేతుల్లో ఉందన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, ఇప్పుడు సమ్మెను అణిచివేసేందుకు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న నాలుగన్నర కోట్ల ప్రజలను బంధించేందుకు జైళ్లు సరిపోవన్నారు.

తెలంగాణ ఉద్యమం పెద్ద కళారూపం: కె. శ్రీనివాస్
తెలంగాణ ఉద్యమంలో పాటే కీలకమని, ఈ ఉద్యమమే పెద్ద కళారూపమని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ అన్నారు. రాజకీయ నాయకుల కంటే ఉద్యమంలో కళాకారులే ముందున్నారని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమం, జనజీవనంలో పాట తెలంగాణ అస్తిత్వానికి పాట కొనసాగింపుగా మారిందన్నారు.

ఆంధ్రోన్నే.. తెలంగాణనే కోరుకుంటున్నా: నారాయణమూర్తి
తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన అడ్డంకిగా మారిందని, టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని వీడి తెలంగాణకు మద్దతు ప్రకటించాలని నటుడు ఆర్. నారాయణమూర్తి కోరారు. తెలంగాణకు అనుకూలంగా సీపీఎం వ్యవహరించాలని కోరారు. నేనూ ఆంధ్రోన్నే అయినా తెలంగాణ ఏర్పాటు కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ‘‘ నేనూ ఆంధ్రోన్నే.. అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని కోరుకుంటున్నా.. మనిషన్న వాడు తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని కోరుకుంటారు.

నేనూ.. మనిషినే. ’’ అని అన్నారు. సూర్యోదయం ఎంత సత్యమో.. తెలంగాణ ఏర్పాటు కావడం కూడా అంతే సత్యమని కళాకారుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. అనంతరం సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్షికసీ నాయకులు వేములపల్లి వెంకవూటామయ్య, ఆరుణోదయ రామారావు, సంధ్య, నాగన్న, సూర్యం, గోవర్ధన్ ప్రసంగించారు. సభ ప్రారంభానికి ముందు ప్రొఫెసర్ కోదండరామ్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, నటుడు ఆర్. నారాయణమూర్తి, సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్షికసీ నాయకులు వేములపల్లి వెంకవూటామయ్య, ఆరుణోదయ రామారావు, సంధ్య, నాగన్న, సూర్యం డప్పులు మెడలో వేసుకొని మోగించి సభికులను ఉత్సాహపరిచారు.

No comments:

Post a Comment